‘ఉర్దూ వర్సిటీ భూములను కాపాడుకుందాం’
స్టేషన్ మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను మతాలకతీతంగా కాపాడుకుందామని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో శనివారం గట్టన్న అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా చూస్తున్నదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న విలువైన భూములను అమ్మకానికి పెడుతున్నదని విమర్శించారు. ఉర్ధూభాషను, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్ధూ యూనివర్సిటీని మతం ప్రాతిపదికన చూడకూడదని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనార్టీల పట్ల కాంగ్రెస్ వివక్ష ఒకస్థాయికి చేరిందని ఆరోపించారు. మౌలానా యూనివర్సిటీ భూములను గుంజుకుంటామని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. అదే విధంగా సమావేశంలో పలువురు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం దురదృష్టకరమన్నారు. సమావేశంలోు షేక్ సిరాజ్, అబ్దుల్లా, బదివుల్లా బేగ్, సికందర్, అబ్దుల్ అజీజ్, టీఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


