తాజాగా ఏసీబీకి చిక్కిన డీఎం
వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్‌మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్‌మోహన్ రెడ్‌హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్‌ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే..
మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
డీఎస్‌ఓ, అడిషనల్ కలెక్టర్‌పై విచారణతో..
పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్‌మోహన్‌ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్‌ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్‌ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్‌లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
పౌర సరఫరాల శాఖలో లంచావతారులు
కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు?
రూ.50 వేలతో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం
తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్‌ఓలపై విచారణతో కలకలం
ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు
ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి


