ఓటరు జాబితాపై ముగిసిన అభ్యంతరాల గడువు
● కార్పొరేషన్‌కు 254 దరఖాస్తులు
● ఇప్పటివరకు 234 పరిష్కరించిన అధికారులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాల గడువు శుక్రవారంతో ముగిసింది. నగర ప్రజల నుంచి చివరి రోజు 30 దరఖాస్తులు రాగా..మొత్తం 254కు చేరాయి. ఇందులో ఈనెల 2న 26, 3న 48, 4న 24, 5న 46, 6న 39, 7న 13, 8న 28 అందాయి. వీటిలో ఇప్పటివరకు 234 అభ్యంతరాలను మున్సిపల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వార్డు ఆఫీసర్లు ఆయా డివిజన్ల వారీగా వాటిని సరిదిద్దారు. మిగిలిన 20 దరఖాస్తులను ఈనెల 10న పూర్తి చేయనున్నారు. మరోవైపు మారిన షెడ్యూల్‌ను తాజాగా కార్యాలయ నోటీసు బోర్డులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు సమక్షంలో ఉంచారు. దీని ప్రకారం 12న డివిజన్ల వారీగా ఫొటోలతో ఉన్న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వివరాలను టీ–పోల్‌లో అప్‌లోడ్ చేస్తారు. చివరగా ఈనెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. వీటి వివరాలను కలెక్టరేట్, ఆర్‌డీఓ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర కార్యాలయాలలో అందుబాటులో ఉంచుతారు. ఇక ప్రతి రోజూ ప్రజలు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో సరిగ్గా ఉన్నాయా? లేవా? అనేది కార్యాలయంలోని రూం నం.2కు వచ్చి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏమైనా తప్పొప్పులు ఉంటే ఆ వెంటనే అధికారులకు దరఖాస్తులు సమర్పించడం గమనార్హం.


