‘సింగోటం’ భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు
● మంత్రి జూపల్లి కృష్ణారావు
● దుర్వినియోగమైన గత నిధుల రికవరీపై ఆదేశాలు
● 15 నుంచి సింగోటం
లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మాత్సవాలు
కొల్లాపూర్ రూరల్: సింగోటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మండలంలోని సింగోటంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15నుంచి జరుగుతున్నందున శుక్రవారం కలెక్టర్ల సంతోష్ అధ్యక్షతన ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈఓ రంగారావును పిలిచి గతలో ఆలయానికి వచ్చిన నిధులు చెప్పాలని ఆదేశించారు. ఇండెక్స్, అకౌంటు రికార్డులు పరిశీలిస్తూ నిధుల గురించి ఆరా తీశారు. నిధుల దుర్వినియోగంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ లెక్కలు పారదర్శకంగా ఉండాలని హెచ్చరించారు. దుర్వినియోగమైన ఆలయ టెండర్లకు సంబంధించిన డబ్బులు నెలరోజుల్లో రికవరీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రాయలసీమ నుంచి నదిలో వచ్చే భక్తులకు అన్నిఏర్పాట్లు చేయాలన్నారు. కొల్లాపూర్ నుంచి నందికొట్కూర్‌కు బస్సులు నడపాలని డిపో మేనేజర్ ఉమాశంకర్‌ను ఆదేశించారు. టూరిజం శాఖ నుంచి రూ.20లక్షల నిధులు ఇవ్వడం జరుగుందని.. అట్టి నిధులతో కట్టపై, ఆలయ పరిసరాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన పార్కింగ్, పారిశుద్ధ్య పనులు, మంచినీటి వసతి చక్కబెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు కొల్లాపూర్ ఆర్డీఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులున్న కలెక్టర్‌కు సమాచారం ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఆహారం, వసతి, వేతనం ఇవ్వాలని ఆలయ పౌండర్ చైర్మన్ ఆధిత్య లక్ష్మణ్‌రావును ఆదేశించారు. జాతరలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఆర్డీఓ బన్సిలాల్, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉపసర్పంచ్ సాయికృష్టగౌడ్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.


