అదృశ్యమైన విద్యార్థిని.. కాల్వలో శవమై తేలింది..
పాన్‌గల్: మండలంలో అదృశ్యమైన విద్యార్థిని భీమా కాల్వలో శవమై కనిపించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుందని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన మాసయ్య, ఎల్లమ్మ కుమార్తు జ్యోతి (14) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంపై విద్యార్థిని తండ్రి మాసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యమైందని కేసు నమోదైంది. భీమా కాల్వ ఒడ్డుపై బూట్లు, స్వెటర్ ఉండటంతో భీమా కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం కాల్వలో కంప చెట్లకు తట్టుకొని విద్యార్థిని మృతదేహం లభించిందని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఇంటి పనులు నేర్చుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతోనే ఆత్మహత్య చేసుకుందా.. ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చికిత్స పొందుతూ మహిళ మృతి
వంగూరు: వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన స్వాతి (22) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వంగూరు ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 6న భర్త పరుశురాములు బైక్‌పై కూర్చుని తుమ్మలపల్లి నుంచి వంగూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో బీపీ అధికమై కిందపడి తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
బల్మూర్: మండలంలోని జిన్‌కుంటకు చెందిన కొండల్(50)చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండల్ కొంతకాలంగా భార్యాపిల్లలతో కలిసి జీవనోపాధికై హైదరాబాద్ వలస వెళ్లాడు. వారం క్రితం పనిచేసేందుకు వెళ్తుండగా.. రోడ్డుదాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య చిట్టెమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు.
కుక్కల దాడి..
55 గొర్రె పిల్లలు మృతి
అమరచింత: వ్యవసాయ పొలంలో ఉన్న గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేయడంతో 55 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటన తూక్యానాయక్ తండా శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన ఆర్‌ఎన్.రాజు, మోసట్ల శ్రీను, మోసట్ల వెంకట్రాములు వృత్తిరీత్యా గొర్రెలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో వీరందరూ కలిసి 55 గొర్రె పిల్లలను వారం కిందట కొనుగోలు చేసి పొలంలోనే కంచె వేసి అందులో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో చొరబడిన కుక్కలు గొర్రెపిల్లలను కొరికి వేయడంతో మృతి చెందాయి. దాదాపు రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అదృశ్యమైన విద్యార్థిని.. కాల్వలో శవమై తేలింది..


