బీచుపల్లిలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసతా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిందూర్ కుంకుమ, రుద్రాక్ష అర్చనలు శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. ప్రకృతి విపత్తుల బారిన పడకుండా దేశం సుభిక్షంగా ఉండాలని, సైనికుల ఆయురారోగ్యాలు శక్తి సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిభాష ప్రవచనకర్త రాఘవేంద్ర ఆచార్యులు ఆలయంలో మొదటగా లలితా పారాయణం, శివ అష్టోత్తర నామావళి, లింగాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం అర్చకులు కుంకుమ, రుద్రాక్ష అర్చనను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా కంచి రుద్రాక్ష, అమ్మవారి డాలర్ అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ శోభారాణి, జిల్లా అధ్యక్షుడు ఫణిమోహన్‌రావు, అలంపూర్ ధర్మరక్షక్ నర్సింహులు, ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు సత్యప్రియ ఆచార్యులు, సత్యప్రకాష్‌రావు, జయసింహారావు, భక్తులు పాల్గొన్నారు.


