జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన ద్రోణదత్తా అనే ఇంటర్ విద్యార్థి అండర్ –17 విభాగంలో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చత్తీస్‌గడ్‌లో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టులో చోటు దక్కించుకున్నాడు. ద్రోణదత్తా 2024లో జరిగిన 40వ జాతీయస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. విద్యార్థి జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక కావడంపై జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, పీడీ ఫారుఖ్ ముకర్రం హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు.
దుండగుల దాడిలో
వంట మాస్టార్ మృతి
మహబూబ్‌నగర్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో వంట మాస్టార్‌గా పనిచేసే ఓ వ్యక్తి మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని షాషాబ్‌గుట్టకు చెందిన అవుసలి శ్రీనివాసులు(51)ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. మృతుడు శ్రీను జీవన ఉపాధిలో భాగంగా పెళ్లిల్లు, శుభకార్యాలయాలకు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి సమయంలో నగరంలోని అన్నపూర్ణ గార్డెన్‌లోపలికి వెళ్లగా దొంగతనం చేయడానికి వచ్చాడని భావించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని శ్రీనివాసులు కొడుకుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసి ఆ మృతదేహం తన భర్తదేని గుర్తించింది. ఆ తర్వాత మృతదేహం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


