‘బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు సరికాదు’
● కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
● 11న సామాజిక న్యాయ సభ
మెట్టుగడ్డ: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మభ్యపెడుతుందని బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ అన్నారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చెల్లని జీఓలు జారీ చేస్తూ బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోందని, బిల్లు పెట్టాం కేంద్రానికి పంపించాం అని చెప్పి బాధ్యాతారాహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి 42శాతం రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ బంద్ నిర్వహించి బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్‌గాంధీ జాతీయ సమస్యగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించి పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని కోరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు – 9వ షెడ్యూల్‌లో రాజ్యాంగ రక్షణ కోసం పాలమూరులో ఆదివారం నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సభను బీసీలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. సమావేశంలో రమేష్‌గౌడ్, సారంగి లక్ష్మీకాంత్, లక్ష్మణ్‌గౌడ్, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.


