స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/జడ్చర్ల టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్‌తో పాటు జడ్చర్ల డా.బీఆర్ అంబేద్కర్ కళాభవన్‌లో ఎస్‌ఐఆర్ అమలు తీరుపై కలెక్టర్ బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ఓటర్ల మ్యాపింగ్, ఇంటింటి పరిశీలన, ప్రోజెనీ (సంతతి) సర్వేలను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణ ప్రాంతాల్లో బీఎల్‌ఓల పనితీరు 25 శాతం కంటే తక్కువగా ఉందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో నమోదైన ఓటర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారా లేదో వారి వివరాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈ పనిని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, బీఎల్‌ఓలో వచ్చే రెండు మూడు రోజుల్లో 80 శాతం పూర్తి చేసేలా సంబంధిత సూపర్ వైజర్లు, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్‌ఓ కృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, తహసీల్దార్లు ఘన్సీరాం, నర్సింగ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


