కాంగి‘రేసు’లో పోటాపోటీ..
అధికార కాంగ్రెస్‌లో మేయర్ ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మారెపల్లి సురేందర్‌రెడ్డి (ఎమ్మెస్సార్) ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే యెన్నం గెలుపు కోసం కృషి చేసిన వారిలో పలువురు నాయకులు ఉన్నప్పటికీ.. ఆనంద్‌గౌడ్, ఎమ్మెస్సార్‌లది కీలక రోల్ అనే చర్చ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ క్రమంలో ఇరువురూ మేయర్ పీఠంపై నజర్ వేయడం.. ముందస్తుగానే సన్నాహాలు మొదలుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీఎన్జీఓ మాజీ నాయకుడు రాజేందర్‌రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎన్‌పీ వెంకటేష్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాధా అమర్ కూడా మేయర్ రేసులో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా ఇద్దరి మధ్యే..
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌లో మేయర్ పీఠం కోసం ఇటు మారెపల్లి సురేందర్ రెడ్డి, అటు ఆనంద్‌గౌడ్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 11వ డివిజన్ నుంచి ఎమ్మెస్సార్.. 49వ డివిజన్ నుంచి ఆనంద్‌గౌడ్ కార్పొరేటర్ పదవి కోసం డీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ వచ్చి.. అఽధిష్టానం అవకాశం ఇస్తే మేయర్ బరిలో ఉంటానని ఎన్పీ వెంకటేష్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈసారి కార్పొరేటర్‌గా బరిలో ఉంటానని.. అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) వస్తే తాను మేయర్ పోటీలో ఉండాలని అనుకుంటున్నానని.. అయితే అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని రాజేందర్‌రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఎమ్మెస్సార్, ఆనంద్‌గౌడ్ మధ్యే మేయర్ అభ్యర్థిత్వం దోబూచులాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


