గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
● సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవంలో ఎస్పీ జానకి
● క్రీడా ప్రతిభ చాటేందుకు గొప్ప వేదిక: అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్
మహబూబ్‌నగర్ క్రీడలు: గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) టార్చ్ ర్యాలీని ఎస్పీ డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంకప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడలవైపు ఆకర్శించి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనన్నారు. పోలీసు, రవాణాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నెలరోజుల జాతీయ రోడ్డు భద్రతపై మాసోత్సవాల సందర్భంగా రోడ్డుభద్రతపై విద్యార్థులు, క్రీడాకారులకు ఎస్పీ అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడవవద్దని, యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించడం కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్టు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ సీఎం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్పవేదికను కల్పించిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని కష్టపడి ఆడి జాతీయ, అంతర్జాతీ వేదికలపై కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెట్టుగడ్డలోని డైట్ కళాశాల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


