సైలెంట్ స్టెప్స్!
మేయర్ గిరిపై ప్రధాన పార్టీల కన్ను
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికలు
● మొదటి సారే కుర్చీ దక్కించుకుని ఘనత చాటేలా కాంగ్రెస్ కసరత్తు
● పీఠంపై ఆనంద్‌గౌడ్, ఎమ్మెస్సార్ నజర్.. సన్నాహాలు ముమ్మరం
● బీఆర్‌ఎస్, బీజేపీలో కూడా మొదలైన కదలిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరగనున్న ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటిసారే కార్పొరేషన్‌పై పార్టీ జెండాను ఎగురవేసి.. చరిత్రలో నిలిచిపోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పురపాలిక ఎన్నికలపై ఆయా పార్టీల్లో ఓ దఫా సమావేశాలు పూర్తి కాగా.. మేయర్ పీఠాన్ని అధిరోహించాలనే సంకల్పంతో ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సైలెంట్‌గా కదన రంగంలోకి దూకారు. వార్డుల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందస్తుగానే మద్దతు కూడబెట్టుకుంటున్నారు.


