రూ.28 కోట్లతో అభివృద్ధి పనులు
● ముడా రెండో సాధారణ సమావేశంలో కమిటీ ఆమోదం
● హాజరైన నలుగురు ఎమ్మెల్యేలు.. కొత్త లోగో ఆవిష్కరణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా ముడా ఆధ్వర్యంలో రూ.28 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం భూత్పూర్ రోడ్డులోని ముడా కార్యాలయంలో చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్ అధ్యక్షతన రెండో సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి రూ.ఏడు కోట్లు, జడ్చర్ల దేవరకద్రకు రూ.ఐదు కోట్ల చొప్పున కేటాయించారు. ముడా నిధులతో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో రూ.రెండు కోట్ల చొప్పున ఒక్కో మహాప్రస్థానం ఏర్పాటు చేయనున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సర్వే నం.25లో అర ఎకరా (20 గుంటల) స్థలంలో నిర్మించనున్న కార్యాలయ పక్కా భవనానికి రూ.ఐదు కోట్లు వెచ్చించనున్నారు. కాగా, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వసూలైన రూ.24 కోట్లు, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సిన రూ.18 కోట్లు ఆయా ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం ముడా కొత్త లోగోను ఆవిష్కరించారు. సమావేశంలో ముడా వైస్‌చైర్మన్ టి.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


