టీడీగుట్ట బ్రిడ్జి నిర్మాణానికి ఏప్రిల్‌లో టెండర్లు
పాలమూరు: దేవరకద్రలో లిమిటెడ్ హైట్ సబ్‌వే, మహబూబ్‌నగర్ నగరంలో టీడీగుట్ట ఆర్‌ఓబీ బ్రిడ్జి మంజూరయ్యిందని, నిర్మాణ పనులకు ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ ఎంపీ డీకే అరుణకు వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో శ్రీవాస్తవ్‌తో ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే సమస్యలపై ఎంపీ ఇచ్చిన వినతి పత్రాలపై మేనేజర్ అధికారులతో సమీక్షించారు. తిమ్మసానిపల్లి, బోయపల్లిగేట్, వీరన్నపేటలోని రైల్వే ట్రాక్‌లపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, మోతీనగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన ఫిజబులిటీ రిపోర్ట్ పూర్తయిందని, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వీటికి సంబంధించి మార్చిలో అనుమతులు వస్తాయని అధికారులు తెలిపారు. త్వరగా మంజూరు చేసి పనులు సైతం సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ కోరారు.


