విద్యార్థులను ఇళ్లకు పంపడంపై విచారణ
బల్మూర్: మండలంలోని చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సంక్రాంతి పండుగ సెలవులకు మూడు రోజుల ముందే ఇంటికి పంపించి ఆశ్రమ పాఠశాలకు తాళం వేశారు. ప్రభుత్వం ఈనెల 10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే స్థానిక ఆశ్రమ పాఠశాలలోని డిప్యూటీ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనెమ్మ మూడు రోజుల ముందే విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మరీ విద్యార్థులను ఇంటికి పంపించి ఏకంగా పాఠశాలకు తాళం వేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా గురువారం ఏటీడబ్ల్యూఓ నాగరాజు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. పాఠశాల హెచ్‌ఎం శంకర్ సెలవుల్లో ఉండగా డిప్యూటీ వార్డెన్ మనేమ్మ ఇన్‌చార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏటీడబ్ల్యూఓ నాగరాజు తెలిపారు.


