ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

ట్రాక

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం

ఊర్కొండ: మండల పరిధిలోని మాదారం గ్రామంలో శివయ్య (25) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి మరణించాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. మాదారం గ్రామానికి చెందిన శివయ్య (25) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం పొలంలో కరిగేట దున్నడానికి వెళ్లారు. భూమి మెత్తగా ఉండటం లేదా గట్టు అంచున అదుపు తప్పడం వల్ల ట్రాక్టర్‌ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ క్రమంలో స్టీరింగ్‌ పక్కనే ఉన్న డ్రైవర్‌ సీటు నుంచి కింద పడిపోగా, ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబపోషణకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ కృష్ణదేవ తెలిపారు.

కాల్వలో పడి

వృద్ధుడు మృతి

గోపాల్‌పేట: మండల కేంద్రంలోని చంద్రాయుని గడ్డ కాలనీలో ఓ వృద్ధుడు కాల్వలో పడి మరణించాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బాలయ్య (57) గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కట్టెలకు వెళుతున్నానని బయటికి వెళ్లాడు. ఏమైందో ఏమో తెలియదు గురువారం తెల్లవారుజామున చంద్రాయుని గడ్డ కాలనీ సమీపంలో ఉన్న కాల్వలో శవమై కనిపించాడు. బహిర్భూమికి వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృతి

తెలకపల్లి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన చింతకుంట్ల బాలరాజు (23) గురువారం ఉదయం తన పొలంలో వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు పొలంలోనే విద్యుత్‌ షాక్‌ గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి చింతకుంట్ల ఏకాకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. యువకుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

నిందితులపై చర్యలు

తీసుకోవాలి

గద్వాల క్రైం: గట్టు మండలం బల్గెరకు చెందిన తిమ్మప్ప అలియాస్‌ ఖయ్యూం ఈ నెల 5న ముల్లంపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ శివారులో దారుణహత్యకు గురైన విషయం విధితమే. అయితే హంతకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గురువారం బాధిత కుటుంబీకులు ఎస్పీ శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. తిమ్మప్పను అదే మండలానికి చెందిన అబ్రహంతో పాటు మరికొందరు కలిసి మద్యం తాగించి ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో పోలీసులు అబ్రహంను మాత్రమే అరెస్ట్‌ చేసి మిగిలిన వారు ఎవరనేది గుర్తించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎస్పీ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి

మరికల్‌: మండలంలోని చిత్తనూర్‌ గ్రామ శివారులో రహస్యంగా కోడిపందెలు నిర్వహిస్తున్న స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 3 కోడిపుంజులు, 14 బైకులు, రూ.15 వేలు నగదు, 16 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 19 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

పీయూలో

క్యాంపస్‌ డ్రైవ్‌..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో కే12 సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ మేరకు పలువురు ఎంబీఏ, ఎంసీఏ డిపార్ట్‌మెంట్‌ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ అధికారి అర్జున్‌కుమార్‌, వినోద్‌, నరసింహ పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం 
1
1/2

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం 
2
2/2

ట్రాక్టర్‌ కిందపడిడ్రైవర్‌ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement