‘ఉపాధిహామీ’ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం
● ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అచ్చంపేట రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు కుట్రలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధిహామీ చట్టంలో 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం సరైంది కాదని.. గతంలో 90 శాతం కేంద్ర నిధులున్నా కొన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు, సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని.. మహాత్మాగాంధీ పేరు ఉండటం కూడా సహించడం లేదని తెలిపారు. పథకం పేరు, చట్టం మార్పిడిని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. కూలీలు, సిబ్బందికి పార్టీ మద్దతు పలికి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యుత్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని.. అమలు జరిగితే పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, వ్యక్తిగత ధూషణలతోనే కాలం వెల్లదీశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గత పార్టీలకు పట్టిన గతే పడుతుందన్నారు. మత్తు వ్యాపారాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని.. దీంతో యువత తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జి ల్లా కార్యదర్శి పర్వతాలు, నాయకులు పాల్గొన్నారు.


