ప్రియుడే కడతేర్చాడు..
వనపర్తి: భర్తను కోల్పోయిన మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సదరు వ్యక్తి ఇంట్లో తెలియడంతో దూరం పెట్టారు. ఈ క్రమంలో తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ మహిళ తరచుగా గొడవ పడుతుండటంతో.. ఎలాగైనా వదిలించుకోవాలని అతడు నిర్ణయించుకొని హతమార్చాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో చోటు చేసుకున్న మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు వివరాల మేరకు.. బెక్కెం గ్రామానికి చెందిన గుంటి రాధ (42) ఈ నెల 1న బీచుపల్లి ఆలయానికి వెళ్లి వస్తానని కూతురు మేఘనకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఐదు రోజులుగా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కూతురు.. ఈ నెల 5న చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి కొప్పునూర్ గ్రామ శివారులో లక్ష్మీపల్లికి చెందిన రైతు పాటిమీది వెంకటయ్య కందిచేనులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతురాలు బెక్కెం గ్రామానికి చెందిన గుంటి రాధగా గుర్తించారు. అయితే తన తల్లి తరచూ ఓ వ్యక్తితో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండేదని మేఘన పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిపల్లికి చెందిన మౌలాలిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా గుంటి రాధతో మౌలాలి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో రాధను దూరం పెట్టాడు. ఈ క్రమంలో తనను ఎందుకు దూరం చేస్తున్నావని.. తనను కలవాలని తరచుగా ఒత్తిడి తేవడంతో కొప్పునూర్ శివారులో మౌలాలి కౌలుకు చేస్తున్న భూమి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన రాధ మౌలాలితో గొడవ పడటంతో విసుగు చెందిన అతడు.. ఆమె చీర కొంగుతోనే గొంతు బిగించి హత్యచేశాడు. శవాన్ని అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో గల కంది చేనులో పడేశాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
వీడిన మహిళ హత్య మిస్టరీ
నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు


