సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మహబూబ్‌నగర్ రూరల్: దళిత విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు కిల్లె గోపాల్ మాట్లాడుతూ.. వేములకు చెందిన దళిత విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అదే విధంగా పాత పాలమూరుకు చెందిన దళిత విద్యార్థి కొత్తకోట మైనార్టీ గురుకుల కళాశాలలో చదువుతూ గతేడాది నవంబర్ 9న రేణిగుంట రిజర్వాయర్‌లో శవమై తేలాడని.. అతడు ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించకపోవడం దారుణమన్నారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి, కార్యదర్శులతో పాటు కలెక్టర్, ఎస్పీ, దేవరకద్ర, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా.. వనపర్తి జిల్లా పోలీసులు మాత్రం పంచనామా (ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్టు రాలేదని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ఘన్సీరామ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఖమర్ అలీ, నాయకులు రాజు, శ్రీనివాసులు, వెంకట్రాములు, వెంకటలక్ష్మి, నవాబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


