దుందుభీలో దోపిడీ
యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
● భారీగా నిల్వలు
● రాత్రిళ్లు టిప్పర్లతో తరలింపునకు సన్నాహాలు
● అనుమతులు లేవంటున్న అధికారులు
జడ్చర్ల: మిడ్జిల్ మండల శివారులోని దుందుభీ వా గులో ఇసుకాసురులు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతూ తరలింపునకు సర్వం సిద్ధం చేశారు. ఆరునెలల కింద ఇక్కడే అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా తరలించారు. టీజీఎండీసీ నుంచి అనుమతి పొందిన వారు నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు తెరలేపి తవ్వకాలు, తరలింపు చేపట్టడంతో నాడు కలెక్టర్ విచారణ చేపట్టి రద్దు చేయడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వారం రోజు లుగా వాగులో భారీ యంత్రాలు, టిప్పర్లను వినియోగించి దర్జాగా తవ్వకాలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ డంప్‌లను సిద్ధంగా ఉంచి సమయం దొరికినప్పుడల్లా తరలించాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.
వందల సంఖ్యలో టిప్పర్లు..
కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగులో ఇసుక డంపులకు అతి దగ్గరగా టిప్పర్లు, హిటాచీలను సిద్ధంగా ఉంచారు. టిప్పర్లు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు దారులు పటిష్టం చేశారు. ఏ క్షణమైనా కనుసైగతో ఇసుక డంప్‌లను మాయం చేసేలా పక్కా ప్రణాళికలను ఇసుకాసురులు అమ లు చేస్తున్నారు. వాగులో ఎక్కడికక్కడ ఇసుక కుప్ప లు కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.
అధికారులు రాకుండా జాగ్రత్తలు..
సంబంధిత అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాల్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేసినా చూస్తాం.. చేస్తా్‌ం.. వస్తున్నాం లేదా బిజీగా ఉన్నామంటూ కాలయాపన చేసే సమాధానాలు వచ్చేలా వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదైమైనా ఈ విడతలో వాగును కొల్లగొట్టాలన్న లక్ష్యంతో ఇసుకాసురులు దురాలోచనలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది.
ఇసుక తరలింపు, తవ్వకాలకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మిడ్జిల్ రెవెన్యూ ఆర్‌ఐ రఘు తెలిపారు. అనుమతులు లేకున్నా వాగులో కొనసాగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతున్నా.. సంబంధిత అధికారులు అటుగా తొంగిచూడక పోవడంపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. కలెక్టర్ స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
దుందుభీలో దోపిడీ


