పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని.. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేసి గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన ఫాంహౌస్‌లో మహబూబ్‌నగర్ పట్టణ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేని లోటు ప్రజలకు కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్తే ప్రజలు అనేక సమస్యలను ఏకరువు పెడుతున్నారని అన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందనే సమాధానం ప్రజల నుంచి వస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి మేలుచేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులకు ఆయన సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, అనంతరెడ్డి, అన్వర్‌పాషా, రెహమాన్, ఆంజనేయులు, ప్రవీణ్, నరేందర్, రాము, వేదావత్, నవకాంత్, కిషోర్, సుధాకర్ తదితరులు ఉన్నారు.
వేరుశనగకు రికార్డు ధర
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈఏడాది ఇప్పటి వరకు ఇంత ధర లభించలేదు. క్వింటాలుకు గరిష్టంగా రూ.9,126, కనిష్టంగా రూ.6,966 ధరలు పలికాయి. వాస్తవంగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ.7,263గా ఉంది. మార్కెట్‌లో ఈ ఏడాది మద్దతు ధరలకు మించి వేరుశనగకు మంచి ధరలు లభిస్తున్నాయి. త్వరలోనే క్వింటా రూ.10 వేల వరకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది వేరుశనగకు మద్దతు ధరలు కూడా లభించని పరిస్థితి ఉంది. ఇక ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.2,386 , హంస రూ.1,832, కందులు గరిష్టంగా రూ.6,920, కనిష్టంగా రూ.5,171, పత్తి గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.6,629, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,976, కనిష్టంగా రూ.1,716 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.6,712, కనిష్టంగా రూ.6,074 ధర పలికింది.
పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత


