లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరతో కలిసి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణుల స్కానింగ్ సమయంలో పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అన్ని క్లినిక్స్ వద్ద లింగ నిర్ధారణ నిషేధమని స్పష్టంగా తెలియజేసే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. డయాగ్నొస్టిక్, ఇతర స్కానింగ్ సెంటర్లలో అధికారులు 90 రోజుల్లోగా తనిఖీలు నిర్వహించి.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ.. పీసీపీఏన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించే వ్యక్తులు, క్లినిక్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 964 మహిళలుగా ఉందన్నారు. లింగ నిష్పత్తి పరిరక్షణకు కఠిన పర్యవేక్షణ అవసరమని అన్నారు. కాగా, జిల్లాలో 85 గర్భకాల నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, ఏఎస్పీ రత్నం, డీఈఎంఓ మంజుల, ఐఎంఏ ప్రతినిధి రామ్మోహన్ ఉన్నారు.


