రామన్‌పాడులో తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 707 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
ముడా కార్యాలయానికి స్థలం కేటాయింపు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు ఏనుగొండలో ముడా కార్యాలయానికి అర ఎకరా (20 గుంటల) స్థలం కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్ విజయేందిర బోయి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆమెతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్ వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, సుమారు మూడేళ్లుగా భూత్పూర్‌రోడ్డులోని పబ్లిక్ హెల్త్ – మున్సిపల్ ఇంజినీరింగ్ కార్యాలయ సముదాయంలో ముడా అధికారులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.


