చిరుత సంచారంతో గ్రామస్తుల ఆందోళన
మల్దకల్: ఉలిగేపల్లి, అడవిరావులచెర్వు గ్రామాల మధ్య ఉన్న బతుకోని చెరువు సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద సోమవారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్, పోలీసు అధికారులకు తెలియజేయగా మంగళవారం ఫారెస్టు అధికారులు మన్యం, జాకీర్ గుట్టల్లో చిరుత జాడల కోసం పరిశీలించారు. చిరుత సంచారంతో ప్రజలు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ విషయంపై ఫారెస్టు అధికారులను సంప్రదించగా తమ పరిశీలనలో ఎలాంటి చిరుత జాడలు లేవని, అది హైనా అయి ఉండవచ్చన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్టు అధికారి పర్వేజ్ అహ్మద్ తెలిపారు.
ఉర్దూ ఘర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన
మహబూబ్‌నగర్ రూరల్: వుహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కళాభవన్ ఆవరణలో ఉర్దూ ఘర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మంగళవారం కళాభవన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కళా భవన్‌కు ఉర్దూ ఘర్‌కు ఎటువంటి ఆధారాలు లేకున్నా రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ నకిలీ కాగితాలు సృష్టించి దౌర్జన్యంగా ఉర్దూ ఘర్‌ను నిర్మాణ పనులను పూనుకున్నారని ఆరోపించారు. కళాభవన్ ఆవరణలో ఉర్దూ ఘర్ నిర్మాణ పనులను దళిత సంఘాల నాయకులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా నచ్చజెప్పారు. అక్కడినుంచి నాయకులను సీఐ డీఎస్పీ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పూర్తి సమాచారం తీసుకొని స్థల వివాదం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని దళిత సంఘాల నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ సింగిరెడ్డి పరమేశ్వర్, కో–చైర్మన్ రాయికంటి రాందాస్, అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి రాజగాని అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 59 తులాల వెండి, 7 గ్రాముల
బంగారు, నగదు అపహరణ
పాన్‌గల్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన తనుపుల పద్మ చిన్న కుమారుడు అరవింద్‌తో కలిసి హైదరాబాదులో ఉంటుంది. రేమద్దులల్లో ఉన్న ఇంటికి నెలలో ఒకటి, రెండు సార్లు వచ్చి పోతుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న సర్పంచ్ ఎన్నికలు ఉండటంతో బంగారు, వెండి వస్తువులు వెంట తెచ్చుకొని ఇంట్లోని బీరువాలో పెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న ఇంట్లోనే ఆభరణాలు వదిలి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం ఇంటి పక్కన ఉండే వ్యక్తి పద్మ పెద్దకుమారుడు భాన్‌ప్రకాష్‌కు ఫోన్ చేసి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉందని సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి 59 తులాలు వెండి, 7 గ్రాముల బంగారు వస్తువులు, రూ.10 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. చోరీపై పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిరుత సంచారంతో గ్రామస్తుల ఆందోళన


