తీర్థయాత్రలకెళ్లి తిరిగిరాని లోకాలకు..
● ఉజ్జయిని పుణ్యక్షేత్రం సమీపంలో రోడ్డుప్రమాదం
● తుఫాన్, ట్రక్ ఢీకొని ఇద్దరు యువకులు, తూఫాన్ డ్రైవర్ మృతి
● మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
చిన్నచింతకుంట: భక్తిభావంతో తీర్థయాత్రలకు వెళ్లి దైవదర్శనం చేసుకుందామని.. ఆపదలు రాకుండా చూడమని మొక్కుకుందామని అనుకున్నారు.. కానీ ఆ దేవుడు వారి మొర ఆలకించలేదు. విధి ఆడిన నాటకంలో ఇద్దరు యువకులు తిరగిరాని లోకాలకు వెళ్లారు. వివరాలిలా.. చిన్నచింతకుంట మండలం పర్ధిపురం గ్రామానికి చెందిన 12మంది గ్రామస్తులు శనివారం తీర్థయాత్రలకు బయలు దేరారు. మంగళవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకొని గ్రామానికి చెందిన కావలి నర్సింహులు(28), శివ(26)తోపాటు దేవసూగూరుకు చెందిన తుఫాన్ డ్రైవర్ జగన్(26) దుర్మరణం చెందారు. శనివారం జగన్ తుఫాన్‌లో తీర్థయాత్రలకు బయలుదేరారు. ముందుగా కర్ణాటకలోని మంత్రాలయం వెళ్లి అక్కడ దైవదర్శనం చేసుకొని అక్కడి నుంచి మహారాష్ట్రలోని తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాంకాళిని దర్శించుకునేందుకు బయలు దేరారు. అంతలోనే మార్గమధ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఉజ్జయినికి 6 కిలో మీటర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. తుఫాన్‌లో ఉన్న తొమ్మిది మందికి స్వల్ప గాయాలు కాగా.. తుఫాన్ డ్రైవర్ జగన్, నర్సింహులు, శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు.
ఉలికిపడ్డ పర్ధిపురం
పర్ధిపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన 11మంది శనివారం తీర్థయాత్రలకు బయలుదేరగా.. అందులో ఇద్దరు రోడ్డుప్రమాదంలో మృతిచెందారన్న వార్త విని కుటుంబ సభ్యులు, బంధవుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. మృతులు అభంశుభం ఎరుగని గొర్రెలకాపరులు తీర్థయాత్రలకు వెళ్లి మృతిచెందారని వారి మృతితో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయ్యాయని అకుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు కనీరుమున్నీరు అయ్యారు.
తీర్థయాత్రలకెళ్లి తిరిగిరాని లోకాలకు..


