ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
మక్తల్: మండలంలోని చిట్యాల పెద్ద వాగు నుంచి మక్తల్ మండల కేంద్రానికి ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గజరందొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకొని వాగు దగ్గర జేసీబీలను ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డగించారు. తమకు అనుమతి ఇస్తే వాగు నుంచి బయటికి డంప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లేలా సహకరిస్తామని జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించి వేశారు. అనుమతితోనే ఇసుక తరలిస్తుండగా అడ్డుకోవడంపై ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా చర్చించి గ్రామస్తులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


