ఉత్కంఠపోరులో మహబూబ్‌నగర్ విజయం
● 4 వికెట్ల తేడాతో వరంగల్‌పై..
● అర్ధసెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ రెండో ఫేజ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 4 వికెట్ల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. సిద్దిపేటలో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కొత్త రోహిత్‌రెడ్డి 43, కె.ప్రదీప్ 36 నాటౌట్, నిక్షిత్ 30 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు వెంకటచంద్ర 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, మహ్మద్ షాదాబ్ అహ్మద్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2, ఆకాష్ వెంకట్, ఎన్.జశ్వంత్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే 61 బంతుల్లో 9 ఫోర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ షాదాబ్ అహ్మద్ 31, ఎ.శ్రీకాంత్‌నాయక్ 22 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లు కె.శ్రీఅఖిలేష్ 2, ఎస్.ఆదర్శ్, నిక్షిత్, పర్దిపన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అబ్దుల్ రాఫే (మహబూబ్‌నగర్) రూ.5వేల నగదు, మెమోంటో అందుకున్నాడు.
ఎండీసీఏ అభినందనలు
కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ–20 లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో లీగ్‌లో ప్రతిభ చాటి చాంపియన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు.


