బ్లాక్ గ్రానైట్ తవ్వకాలు నిలిపేయాలి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వే నంబర్ 182లో చేపడుతున్న బ్లాక్ గ్రానైట్ తవ్వకాలను నిలిపివేయాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఏడాది క్రితం బ్లాక్ గ్రానైట్ తవ్వకాలు నిలిపి వేయాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, మైనింగ్ అధికారులకు వినతిపత్రాలు అందించడంతో తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు. కానీ మంగళవారం మళ్లీ యంత్రాలతో గ్రానైట్ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తవ్వకాలు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకొని యంత్రాల ఎదుట బైఠాయించారు. తవ్వకాలు చేపడితే ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పనులు నిలిపి వేయాలని సర్పంచ్ రామస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, తహసీల్దార్ ఉమ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రైతులు పసుల శ్రీను, విజయ్‌కుమార్, అంజయ్య, దుర్గయ్య, కృష్ణయ్య, ఎల్లయ్య, రమేష్, ఇస్తారయ్య, పెద్దయ్య తదితరులు ఉన్నారు.


