డివిజన్ల బౌండరీలోని ఓట్లే తీసుకోవాలి
● ఇప్పటికే కలిసిన మిగతావి తొలగించాలి
● ముక్తకంఠంతో కోరిన అన్ని పార్టీల ప్రతినిధులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా డివిజన్ల బౌండరీ (సరిహద్దు)లోని ఓట్లే జాబితాలో పొందుపరచాలని అన్ని పార్టీల ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. ఇతర జిల్లాలు, గ్రామాలకు చెందిన ఓటర్ల పేర్లను వెంటనే తొలగించాలన్నారు. క్షేత్రస్థాయికి వార్డు ఆఫీసర్లు, బీఎల్‌ఓలను పంపించి అన్నింటినీ సరిదిద్దాలన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన 13 పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా డివిజన్‌లలో 200 నుంచి 300 మంది వరకు ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ముసాయిదాలో ప్రకటించారన్నారు. ఒక కుటుంబంలో పది ఉంటే అందులోని ఇద్దరు ముగ్గురి పేర్లు వేరే డివిజన్‌లో ఎలా చూపిస్తారన్నారు. ఈ జాబితా పూర్తిగా తప్పుల తడకగా, గందరగోళంగా ఉందన్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో ఉండటం తగదన్నారు 60 డివిజన్ల పరిధిలో 4,708 తప్పులు ఉన్నాయని, ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని వీటిని వెంటనే సరిచేయాలన్నారు. కొన్ని డివిజన్లలో ఇంటి నంబరుకు బదులు వ్యక్తుల పుట్టిన తేదీలు ఉన్నాయన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తప్పక పాటించాలన్నారు. గతంలో 49 వార్డులకు గాను ఎస్సీలకు నాలుగు సీట్లు దక్కాల్సి ఉండగా ఇద్దరికే అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు 60 డివిజన్లకు కచ్చితంగా 9 కేటాయించాలన్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన సమయంలో అశాసీ్త్రయంగా డివిజన్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. చాలా డివిజన్లలో 3,200 ఓటర్లకు బదులు ఏకంగా 3,600 వరకు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత జూన్‌లో ఏర్పాటు చేసిన డివిజన్ల మ్యాపింగ్ ప్రకారమే ఓటర్లు ఉండేలా చూస్తామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా జాబితాలో నిబంధనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఒక్కో డివిజన్‌లో మూడు నుంచి నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కనీసం 800 నుంచి 840 మంది వరకు ఓటర్లు ఉండేలా జాబితాలో పొందుపరుస్తున్నామన్నారు.


