డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు
● విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి
● కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత
పాలమూరు: రోడ్డు ప్రమాదాలను తగ్గించి వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులో పోస్టర్లు ఆవిష్కరించారు. రోజురోజుకు అన్ని రకాల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర వాహనదారులు సీటుబెట్టు పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి ఎలాంటి పరిస్థితిలో కూడా వాహనం నడపరాదని, ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాలు నష్టపోతాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను రక్షించవచ్చునని తెలిపారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు.
● జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని గాజులపేటలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం నగరంలోని ఐటీఐ బాలుర కళాశాలలో రోడ్డు భద్రతలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.


