మహిళా సంఘాల్లో సౌర వెలుగులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 17 రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇందుకు గాను వినియోగంలో లేని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు లభించే విధంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సౌరశక్తి వినియోగం ప్రోత్సహించడానికి పీఎం కుసుమ్ పథకం ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా అమలు చేయాలని నిర్ణయించుకుంది. వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజర, ప్రైవేట్, లీజు భూములలో ఒప్పందాలతో సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు భూముల వివరాలు సేకరిస్తున్నారు.
2 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం..
మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి సుమారు రూ.3– 3.50 కోట్ల వరకు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు మహిళా సంఘాలకు 10 శాతం గ్రాంట్ గ్రామ సమాఖ్య లేదా మండల సమాఖ్యల నుంచి చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేయనున్నారు.
● ఒక్కో మెగావాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ నుంచి రోజుకు కనీసం 4 యూనిట్ల విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో మహిళా సంఘాలకు అన్ని విధాలుగా ఆదాయం చేకూరుతుంది. సోలార్ శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా ప్రతినెలా రూ.2,16,000 ఆదాయం సమకూరవచ్చు.
రెండు మండలాల్లో ఏర్పాటు..
జిల్లాలోని దేవరకద్రతోపాటు బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నాలుగు ఎకరాల చొప్పున ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. స్థానికంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరువలో ఉండేలా ప్రాధాన్యమిచ్చారు. ఇక్కడ ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి 4 నుంచి 5 ఎకరాలు కేటాయింపు
ఇందిరమ్మ మహిళా శక్తితో ఉపాధి అవకాశాలు
దేవరకద్ర, బాలానగర్ మండలాల్లో ఏర్పాటుకు చర్యలు
మహిళా సంఘాల్లో సౌర వెలుగులు


