పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్‌చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్‌రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్‌కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 10.5 ఎకరాల స్థలంలో రూ.81 కోట్లతో మూడు అంతస్తులలో 12 కోర్టుల ఒకే భవన సముదాయం ఒకేదగ్గర నిర్మాణం అవుతుందన్నారు. ఈ నూతన భవన నిర్మాణం రాబోయే 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయ జీవనోపాధిగా, పట్టణీకరణతో అభివృద్ధి చెందుతున్న జిల్లా అన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
నెరవేరిన చిరకాల కోరిక..
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయడంతో కక్షిదారులు, న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. పాలమూరును మొదట రుక్మాపూర్ అని పిలిచేవాళ్లని 1890లో మహబూబ్‌నగర్‌గా మారిందన్నారు. స్థానికంగా భూముల ధరలు పెరిగాయని, ఒకప్పటి కరువు ఇప్పుడు లేదని, జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తోందని, ఇక్కడి ప్రజలు చాలా ప్రేమగల వారని తెలిపారు. కోర్టులలో పెండింగ్ కేసులు కేవలం న్యాయ అధికారులు, న్యాయవాదులపైనే కాకుండా.. అందరి బాధ్యత ఉంటుందన్నారు.
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని, భూ తగాదాలు ఒక ఉదాహరణ అన్నారు. గతంలో కోర్టుకు వెళ్లాలంటే ఆలోచించే వారని, ప్రస్తుతం కోర్టుకు వెళ్తే పరిష్కారం లభిస్తుందన్న భరోసా పెరిగిందన్నారు. సమాజానికి న్యాయవాదులు అవసరం అని ఎలాంటి తగాదాలు వచ్చిన సలహా ఇస్తారని, జడ్జికి కక్షిదారుడికి మధ్య సంధానకర్తగా ఉంటారని తెలిపారు. జస్టిస్ టి.మాధవిదేవి మాట్లాడుతూ పాలమూరు నా పుట్టినిల్లు, మెట్టినిల్లు ఇదే జిల్లా కావడం విశేషం అన్నారు. ప్రస్తుత కోర్టు భవనం 1833లో నిర్మాణం చేయగా 1951లో కోర్టు భవనంగా ఏర్పడిందన్నారు. జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు మాట్లాడుతూ కక్షిదారులు పెరగడం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కానీ కోర్టులు పెరిగి సరైన వసతులు లేని ఇరుకు గదుల్లో పని చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా నూతన కోర్టు భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత, కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ కోత్వాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కార్యదర్శి శ్రీధర్‌రావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
రెండేళ్లలో కోర్టు భవన నిర్మాణం పూర్తికావాలి
రూ.81 కోట్లతో ఒకే సముదాయంలో 12 కోర్టులు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్
నూతన కోర్టుల భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన న్యాయమూర్తులు


