మునగ సాగు.. లాభాలు బాగు
అలంపూర్: ప్రకృతి వైఫరీత్యాలతో అన్నదాతలు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. వర్షాధార పంటలు సాగు చేయడం గగనమైంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి రైతులు మునగ సాగుపై దృష్టిసారిస్తున్నారు. గతంలో మునగ సాగు బహువార్షిక పంటగా ఉండేదని.. ప్రస్తుతం ఏక వార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నీటివసతితో దీన్ని ఏకకాలంలో సాగు చేసుకోవచ్చని వివరిస్తున్నారు.
మునగలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ సీ, ఏ ఉంటాయి.
● ఆకుల నుంచి తీసిన రసానికి బ్యాక్టీరియాను తట్టుకోనే శక్తి ఉంటుంది.
● గింజల నుంచి బెన్ ఆయిల్ లభిస్తోంది.
● చెక్క నుంచి నీలంరంగు డైని తయారు చేసుకొనే అవకాశం ఉంటుంది.
రకాలు..
● పీకేఎం–1, పీకేఎం–2, జీకేదీకే–1, జీకేదీకే–2 రకాలుంటాయి. పీకేఎం–1 రకం అధిక ప్రాచుర్యం పొందినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మునగ చెట్టు 6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. 90 నుంచి 100 రోజుల్లో పూత దశకు చేరుకుంటుంది. మొదటి కోత 150 నుంచి 170 రోజుల్లో వస్తుంది. ఒక చెట్టు ఏడాదికి 250 నుంచి 280 వరకు కాయలు కాస్తోంది. ఒక్కో కాయ 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు.. 140 గ్రాముల బరువు ఉంటుంది.
ఎకరం సాగుకు 250 నుంచి 300 గ్రాముల విత్తనాలు అవసరం. 5 గీ9 అంగుళాల పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇసుక 2:1:1 నిష్పత్తిలో నింపి నీరు పోసి ఆరబెట్టాలి. ఒక్కో సంచిలో ఒక్క విత్తనం నాటి సంచి కింది భాగంలోకి వెళ్లడానికి 6 నుంచి 8 రంధ్రాలు చేయాలి. నెల తర్వాత పొలంలో 2.5 గీ2.5 మీటర్ల దూరంలో ఎకరాకు 640 నుంచి 650 వరకు మొక్కలు నాటాలి.
పొలంలో మొక్కలు నాటిన వెంటనే నీరు పెట్టాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా 7 నుంచి 10 రోజులకు ఓసారి నీరందించాలి. పూత సమయంలో నీటి పారుదలలో ఒడిదుడుకులు తలెత్తితే పూత రాలిపోతుంది. కాపు సమయంలో 4 నుంచి 6 రోజులకు ఒకసారి నీరందిస్తే దిగుబడి పెరుగుతుంది.
పొలంలో మొక్కలు నాటే సమయంలో 2 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేప పిండి, 250 గ్రాముల సూపర్ వే యాలి. మొక్క నాటిన 3, 6, 9 నెలలకు ఓసారి 100 గ్రాము ల యూరియా, 75 గ్రాముల పొటాష్ వేసి నీరందించాలి.
పొలంలో నాటిన మొక్క మూడు అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లను తుంచి వేయాలి. దీని వలన పక్క కొమ్మలు అధికం అవుతాయి. పక్క కొమ్మ 1 నుంచి 2 అడుగులు పెరి గిన తర్వాత దాని చివర్లు తుంచి వేయాలి. దీంతో పక్క కొ మ్మలపై చిరు కొమ్మలు ఏర్పడి చెట్టు గుబురుగా అవుతుంది.
మొదట పంట తీసుకున్న తర్వాత మొక్కలను నేల నుంచి మూడు అడుగులు వదిలి కత్తిరించాలి. ఇలా చేయడంతో కొత్త కొమ్మలు వస్తాయి. ఎరువులు వేసి మట్టిని ఎగదోయాలి. నెల తర్వాత ఒక్కో మొక్కపై 5 నుంచి 6 కొమ్మలు ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మూడేళ్ల వరకు పంట తీసుకోవచ్చని చెబుతున్నారు.
పాడి–పంట
మునగ సాగు.. లాభాలు బాగు


