అధ్వానంగా మారిన తుమ్మిళ్ల లిఫ్ట్ పైప్‌లైన్ రోడ్డు
పొంచి ఉన్న ముప్పు..
ఏపుగా పెరిగిన ముళ్లపొదలు..
తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి పచ్చర్ల మీదుగా తనగలలోని డి–23 వరకు ఏడు కిలోమీటర్ల మేర రెండు వరుసల పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే పైప్‌లైన్ పర్యవేక్షణ కోసం రోడ్డు నిర్మించారు. ఈ రహదారిపై ఎక్కువగా ఇసుక ట్రాక్టర్లు, తుమ్మిళ్ల నుంచి పచ్చర్ల, తనగల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు, గతంలో టీఎస్‌ఎండీసీ అనుమతి పొందిన తుమ్మిళ్లలో ఇసుక రీచ్ ఉండటంతో ఇదే మార్గంలో భారీ టిప్పర్లు రోజు పదుల సంఖ్యలో తిరగడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించొద్దని సంబంధిత అధికారులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అధికారులు ఆ మార్గానికి గుంత తీసి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అయినా కూడా పక్క నుంచి దారి మళ్లించుకొని రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అసలే నల్లభూమి కావడంతో భూమి కుంగడం, వాహనాల రాకపోకలతో పైప్‌లైన్ దెబ్బతింటుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలను నిలిపివేస్తే మేలు చేకూరుతుందని రైతులు అంటున్నారు.
రాజోళి: తుమ్మిళ్ల నుంచి ఆర్డీఎస్ డి–23 వరకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పర్యవేక్షణకు అధికారులు ఏర్పాటు చేసుకున్న రహదారి అధ్వానంగా మారింది. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండటంతో దెబ్బతింటోంది. దీంతో అధికారులు పర్యటన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్డీఎస్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా రాకపోకలకు ఈ రహదారి (ఇన్‌స్పెక్షన్ పాత్)ని వినియోగిస్తారు. ఈ రోడ్డుపై ఇతర వాహనాలు తిరిగేందుకు వీలుండదు. కాని రైతులు, చుట్టుపక్కల గ్రామాల వారు రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం రావడం, చుట్టుపక్కల గ్రామాల వారు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నా ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాని నిరంతరం ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాలు తిరుగుతుండటంతో గుంతలు పడి కనీసం అధికారుల వాహనాలు కూడా తిరగలేని విధంగా మారింది. ప్రస్తుతం రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు అదుపుతప్పి కాల్వలోకి పడిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాలు
తిరగడంతో దెబ్బతిన్న వైనం
నియంత్రణ చర్యలు చేపట్టినా
ఫలితం శూన్యం
పొంచి ఉన్న ముప్పు
తుమ్మిళ్ల నుంచి వేసిన పైప్‌లైన్ రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. పరిసర గ్రామాలకు ద్విచక్ర వాహనదారులు, ఆటోలు వెళ్లడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ రహదారి దెబ్బతినడంతో రాకపోకలు అవస్థలు తప్పడం లేదు.
అధ్వానంగా మారిన తుమ్మిళ్ల లిఫ్ట్ పైప్‌లైన్ రోడ్డు


