శాంతి యాక్టు, విద్యుత్ సవరణ బిల్లుకు నిరసనగా ధర్నా
దోమలపెంట: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న శాంతి యాక్టు, విద్యుత్ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్‌సీసీఓయి ఐకాస పిలుపుమేరకు మంగళవారం ఈగలపెంటలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈ పరిపాలన భవనం వద్ద విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ప్రధానంగా పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరపకుండా శాంతి యాక్టును ఆమోదించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరకే నిర్ణయంగా తెలిపారు. దీని ఫలితంగా ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ పూర్తిస్థాయిలో అణు విద్యుత్ ఉత్పాదనను ప్రైవేటీకరించడంగా చెప్పారు. ప్రస్తుతం కేంద్రం శీతాకాల సమావేశంలో విద్యుత్ సవరణ చట్టం 2025 బిల్లును పార్లమెంటలో పెట్టనున్నారు. అణువిద్యుత్ అనేది పెద్ద అంశం. దీనిని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దేశ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుందన్నారు. విద్యుత్ అంశాన్ని ఒక సహజ వనరుగా కాకుండా వ్యాపారంగా కేంద్రం చేయబోతుందన్నారు. ఒక మనిషికి తిండి, కూడు, గూడు, నీడ ఏవిధంగా అవసరమో ప్రస్తుత సమాజంలో సహజ విద్యుత్ కూడా సహజ వనరు అయ్యిందన్నారు. ఈ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన శాంతి యాక్టు బిల్లుకు, ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లు ప్రజావ్యతిరేక చట్టాలని నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎన్‌సీసీఓఈ ఐకాస పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని జేఏసీ నాయకులు వంశీకృష్ణ, నరేశ్‌కుమార్, సందీప్, యాదయ్య, వెంకటరెడ్డి తెలిపారు.


