నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు భవిష్యత్
కొత్తకోట రూరల్: విద్యార్థులు తమ తమ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధిస్తేనే వారికి భవిష్యత్ ఉంటుందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణజోషి అన్నారు. శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 11వ వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ మాట్లాడుతూ రోజురోజుకూ జనాభా పెరిగి సహజ వనరులు తగ్గుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేల, నీరు కాలుష్యం కాకుండా పంటల సాగులో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. ఉద్యోగాల కల్పన పూర్తిగా విద్యార్థులు నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. వర్టికల్ ఫార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక అంశాల్లో మానవనరుల అవసరాలు చాలా ఎక్కువ అని గుర్తు చేశారు.
ఖర్చులు తగ్గేలా..
పెట్టుబడి ఖర్చులు తగ్గించే టెక్నాలజీ, నూతన వంగడాలు రైతుకి ఎంతో మేలు చేస్తాయని, ఆ దిశగా శాస్త్రవేత్తలు పని చేయాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో సంవత్సరం అంతా ఉపాధితో పాటు రైతుల ఆదాయ వనరులు పెరుగుతాయని, అలాగే సూక్ష్మసేద్యానికి రైతులు అలవాటు పడితే నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుందని ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన వీడియోను ప్రదర్శించారు. వివిధ మోడళ్లపై బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓఎస్‌ఏ డాక్టర్ శంకరస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళాధర్ బాబు, డాక్టర్ షహనాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, శ్వేత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


