కార్మికులందరికీ ఇశ్రామ్ కార్డులు అందజేయాలి
పాలమూరు: అన్ని రకాల కార్మికులకు ఇశ్రామ్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆశ్రయ సంస్థ ద్వారా అసంఘటిత కార్మికులకు శనివారం ఇశ్రామ్ కార్డులను న్యాయమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది అసంఘటిత భవన కార్మికులు, వ్యవసాయ, ఇళ్లలో పని చేసేవారు, ఇలా అన్ని రకాల కార్మికులకు చట్ట ప్రకారం కార్డులు పొంది ప్రభుత్వ ప్రయోజనం పొందాలన్నారు. ఈ కార్డులపై కార్మికులకు విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి.ఇందిర మాట్లాడుతూ ఇశ్రామ్ కార్డులు పొందిన కార్మికులు వారి కుటుంబానికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, అనుకోని ప్రమాదాలు జరిగిన సమయంలో ఆర్థికంగా సహాయం చేయడానికి కార్మిక శాఖ నుంచి ఉండే ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అల్తాఫ్, ప్రవీణ్, అంజాద్,పవన్, నరేందర్,సౌమ్య, చంద్రశేఖర్,నర్మద పాల్గొన్నారు.


