మహిళలకు సముచిత స్థానం: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహిళలకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని శనివారం స్థానిక శిల్పారామం ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చీరలను స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారిక యూనిఫాంగా ఉపయోగించాలన్నారు. జీజీహెచ్‌లో డెలివరీ అయిన నియోజకవర్గ మహిళలకు హెల్త్ కిట్లు అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ కొన్ని చోట్ల వరి కొనుగోళ్లు, పెట్రోల్‌బంక్‌లు, సోలార్ ప్యానెల్ యూనిట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సమాఖ్యలకే అప్పగిస్తున్నామన్నారు. కాగా, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని 1,847 గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీలలో సభ్యత్వం కలిగిన 19,102 మంది మహిళలకు నీలం రంగు చీరలు ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంఘం చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.


