ఎకై ్సజ్ శాఖ పంపకాల్లో విభేదాలు
● కురుమూర్తి జాతర బెల్ట్ షాపుల విషయంలో మామూళ్ల పంచాయితీ
● డిప్యుటేషన్‌పై ఇద్దరు ఎస్‌ఐల బదిలీ ● విచారణాధికారిగా ఈఎస్ నియామకం
మహబూబ్‌నగర్ క్రైం: ఎకై ్సజ్ శాఖలో మామూళ్ల పంపకాల విషయంలో వచ్చిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరు ఎస్‌ఐలపై బదిలీ వేటుపడటం కలకలం రేపుతోంది. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఉండే ఏ4 మద్యం దుకాణాల్లో ఒక్కో దుకాణం దగ్గర రూ.30 వేలు, బార్‌ల నుంచి రూ.35 వేల వరకు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సర్కిల్ పరిధిలో పదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన కానిస్టేబుల్స్ రెగ్యులర్ మామూళ్లు వసూలు చేయడంలో అసలు సూత్రధారులని తెలుస్తోంది. వచ్చిన దాంట్లో సిబ్బంది దగ్గరి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రత్యేక వాటాలు వెళుతున్నట్లు సమాచారం. అయితే మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో పట్టణ ఎస్‌ఐగా సుష్మ పని చేస్తుంటే, రూరల్ ఎస్‌ఐగా సుధాకర్‌రెడ్డి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న కురుమూర్తి జాతరలో బెల్ట్ దుకాణాల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. అక్కడ పర్యవేక్షణ కోసం మహబూబ్‌నగర్ సర్కిల్ నుంచి బృందాలు ఏర్పాటు చేసి విధుల కేటాయింపు చేశారు. అయితే జాతరలో ఉండే బెల్ట్ దుకాణాల నుంచి రావాల్సిన మామూళ్ల పంపకాల విషయంలో అంతర్గతంగా వచ్చిన విభేదాల వల్ల ఇద్దరు ఎస్‌ఐ, సిబ్బంది గొడవ పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కావడంతో గుట్టుగా ఉన్న విషయం బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై ఉమ్మడి జిల్లా డీసీ విజయ్‌భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఇద్దరు ఎస్‌ఐల ఘటనపై విచారణ కోసం మహబూబ్‌నగర్ ఈఎస్ సుధాకర్‌ను నియమించామని, విచారణ తర్వాత రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఎస్‌ఐలను డిప్యుటేషన్ కింద సుష్మను అచ్చంపేటకు, సుధాకర్‌రెడ్డిని కొల్లాపూర్‌కు పంపిస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల నుంచి తీసుకుంటున్న మామూళ్ల వ్యవహారం తన దృష్టికి రాలేదని దీనిపై విచారణ చేస్తామని తెలిపారు.


