
సోలార్‌తో దీర్ఘకాలిక ప్రయోజనం
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని విస్తృతం చేయాలని కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోందని తెలంగాణ రెడ్‌కో చైర్మన్ శరత్ తెలిపారు. శుక్రవారం సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్‌లో ఆయన కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ దేవసహాయం, విద్యుత్ శాఖాధికారులు, రెడ్కో అధికారి మనోహర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్‌తో కరెంట్ ఆదా, పర్యావరణ పరిరక్షణ, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా పలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అమ్రాబాద్ మండలంలోని మాచారంలో అమలు జరుగుతున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం వివరాలను కలెక్టర్ వివరించారు. అలాగే కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ ప్లాంట్ పురోగతిని కూడా సమీక్షించారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై..
ప్రభుత్వ కార్యాలయాలన్నింటి మీద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పంచాయతీ భవనాల నుంచి కలెక్టరేట్ వరకు సౌరశక్తి వినియోగం విస్తరించాలనే సంకల్పాన్ని వివరించారు. ప్రారంభ పెట్టుబడి తప్ప మరిన్ని ఖర్చులు లేకుండా సౌరశక్తి దీర్ఘకాలిక లాభాలు అందిస్తుందని, దీనివల్ల శబ్ద కాలుష్యం లేదా వ్యర్థాల సమస్యలు రాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చే విధంగా సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకులాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో కూడా సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించామని, దీనికి అనుగుణంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన భూ వైశాల్యం, నెలవారీ విద్యుత్ వినియోగ వివరాలను మండల స్థాయిలో సేకరించి నివేదికలు సమర్పించనున్నట్లు తెలిపారు.