
రాష్ట్రస్థాయి పోటీలకు వేళాయె..
● నేటి నుంచి పీయూలో 11వ రాష్ట్ర అథ్లెటిక్స్ జూనియర్ చాంపియన్‌షిప్
● 157 ఈవెంట్స్‌లో పాల్గొనున్న 1,150 మంది క్రీడాకారులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో శనివారం నుంచి జి.రాజేంద్రప్రసాద్ స్మారక 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు పీయూలోని సింథటిక్ ట్రాక్ వేదిక కానుంది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 157 ఈవెంట్స్‌లో అండర్–14, 16,18,20 విభాగాలకు చెందిన 1,150మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పలు జిల్లాల నుంచి క్రీడాకారులు శుక్రవారం సాయంత్రమే పీయూకు చేరుకున్నారు. ఈవెంట్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శిల్పిరామంలో పురుషులకు , దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ శిశువికాస్‌లో బాలికలకు వసతి కల్పించారు. ఇక పీయూ గ్రౌండ్‌లో భోజన వసతి కల్పించనున్నారు. ఈవెంట్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను మూడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నాయకులు శరత్‌చంద్ర, సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి హాజరవుతారన్నారు. ఈవెంట్స్ నిర్వహణకు 30మంది కోచ్‌లు, 35మంది టెక్నికల్ అఫీషియల్స్, 30మంది వలంటీర్లను కేటాయించినట్లు తెలిపారు.