
ఉదండాపూర్ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి త్వరలోనే మరో రూ.200 కోట్లు విడుదల కానున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ముంపునకు గురవుతున్న చిన్నగుట్ట తండాలో నిర్వహించిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి ఆయనతో పాటు కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఒంటిగుడిసెతండా, చిన్నగుట్టతండా, రేగడిపట్టతండా, తుమ్మలకుంటతండాకు చెందిన 237 నిర్వాసితులకు వారు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే రిజర్వాయర్ పరిధిలోని వల్లూరుతో పాటు ఐదు గిరిజన తండాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేశామని.. ఇక మిగిలింది ఉదండాపూర్ గ్రామం మాత్రమేనని, ఆర్‌అండ్‌ఆర్ మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే అవార్డ్ పాస్ చేయించి గ్రామ నిర్వాసితులకు ప్యాకేజీ పరిహారాన్ని అందజేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటి స్థలాలను కేటాయించామని పేర్కొన్నారు. ఆయా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్‌కుమార్, తహసీల్దార్ నర్సింగరావు, పుర చైర్‌పర్సన్ పుష్పలత, మార్కెట్ చైర్‌పర్సన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.