1.80 లక్షల క్యూసెకుల వరద | - | Sakshi
Sakshi News home page

1.80 లక్షల క్యూసెకుల వరద

Aug 29 2025 2:16 AM | Updated on Aug 29 2025 2:16 AM

1.80 లక్షల క్యూసెకుల వరద

1.80 లక్షల క్యూసెకుల వరద

జూరాల 18 క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగువ నుంచి 1.80 లక్షల క్యూసెక్కుల వరద చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో 18 క్రస్ట్‌ గేట్లను పైకెత్తి 1,48,323 క్యూసెక్కులు దిగువకు వదిలారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 34,559 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 46, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 390, కుడి కాల్వకు 680 క్యూసెక్కులు వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.609 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు.

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. గురువారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 254.863 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 286.458 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు 541.321 మి.యూ. చేపట్టామన్నారు.

11 వేల క్యూసెక్కులు విడుదల..

మదనాపురం: మండలంలోని సరళాసాగర్‌ జలాశయం నుంచి గురువారం 11,320 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద రావడంతో 3 ఉడ్‌ సైఫాన్లు, 2 ప్రైమరీ సైఫాన్లు తెరుచుకున్నాయి. దీంతో మదనాపురం చిన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

రాకపోకలకు అంతరాయం..

సరళాసాగర్‌, శంకర సముద్రం నీరు రావడంతో మదనాపురం వద్ద ఉన్న కాజ్‌వే నీట మునిగింది. దీంతో ఆత్మకూర్‌, కొత్తకోట, అమరచింత, చిన్నచింతకుంట, వనపర్తికి రాకపోకలు నిలిచిపోయాయి. దంతనూరు–శంకరమ్మపేట గ్రామాల మధ్య కాజ్‌వే నీట మునిగి రెండు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

రామన్‌పాడు 2 గేట్లు ఎత్తి..

ఊకచెట్టు వాగుతో పాటు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో గురువారం రామన్‌పాడు జలాశయానికి 10 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

కోయిల్‌సాగర్‌ ఒక గేట్‌ ఎత్తి..

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ జలాశయానికి బుధవారం భారీగా వరద రావడంతో 3 గేట్లు తెరువగా గురువారం ఉదయం తగ్గడంతో రెండు మూసి ఒక గేటు ద్వారా దిగువకు నీటి విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా నీటి విడుదల చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉందన్నారు.

శ్రీశైలం జలాశయం 9 గేట్లు ఎత్తి..

దోమలపెంట: శ్రీశైలం జలాశయానికి గురువారం జూరాల, సుంకేసుల నుంచి 1,94,577 క్యూసెక్కుల వరద చేరగా.. 9 గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి 2,23,119 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,305 క్యూసెక్కులు అదనంగా దిగువకు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 882.0 అడుగుల నీటిమట్టం, 198.8120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో 16.801 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 13.296 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement