
రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికుడు మృతి
నవాబుపేట: రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికుడు మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూచూర్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బసిరెడ్డి యాదగిరి(45) రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడు. అనంతరం ఆయన బెంగళూర్‌లో డిఫెన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వినాయక చవితికి స్వగ్రామం కూచూర్‌కు వచ్చాడు. బుధవారం పూజలు ముగించుకుని జిల్లా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గ్రామ సమీపంలో హస్మసానిపల్లి గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో మాజీ సైనికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. యాదగిరి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ క్రైం: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. స్దానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండల పరిధిలోని శ్రీపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన కూతురు అనురాధ (19)తో కలిసి జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే పార్వతమ్మ గురువారం పాలెంకు వెళ్లగా అనురాధ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పార్వతమ్మ కూతురుకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో పక్కింటి వారికి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి తల్లికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు.
ఉరేసుకొని
వ్యక్తి ఆత్మహత్య
బిజినేపల్లి: మండలంలోని గుడ్లనర్వకు చెందిన గణేష్ (34) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గణేష్ బిజినేపల్లి మండల కేంద్రంలోని నందివడ్డెమాన్ కమ్మాన్ వద్ద ఫుట్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం దుకాణం లోపలె ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. గణేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
వృద్ధుడు మృతి
భూత్పూర్: విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతులమడుగు గ్రామానికి చెందిన కొత్త తెలుగు చెన్నయ్య (69)ప్రతి రోజు మాదిరిగా వరిపంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టాటర్ డబ్బా డోర్ తెరిచే క్రమంలో కరెంట్ పోల్ నుంచి డబ్బాకు వచ్చే సర్వీస్ వైరు తేలి ఉండటంతో చేతికి తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన పక్క పొలం వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చెన్నయ్య కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో
జూనియర్ లైన్‌మెన్ మృతి
మహబూబ్‌నగర్ క్రైం: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ (29) పట్టణంలో విద్యుత్ శాఖ సెక్షన్–1 వన్‌టౌన్ పరిధిలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత కురిహిశెట్టి కాలనీ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం రావడంతో మరమ్మతు చేయడానికి వెళ్లిన జూనియర్ లైన్‌మెన్ అరుణ్‌కుమార్‌కు విద్యుత్ షాక్ తగలడంతో ఇతర సిబ్బంది చికిత్స జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అరుణ్‌కుమార్‌కు ఇటీవల పెళ్లి నిశ్చయం కావడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో మృత్యువాతపడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.