
రాజ్యం మనిషి ప్రాణం కాపాడేదిగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాజ్యం మనిషి ప్రాణాలను కాపాడటానికి ఉండాలి కానీ చంపడానికి కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం స్థానిక రెడ్‌క్రాస్ భవన్‌లో కనకాచారి 20వ వర్ధంతి సందర్భంగా కేకే మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కనకాచారి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనకాచారి చాలా కాలం ఉపాధ్యాయ సంఘంలో పని చేస్తూనే సమాజంలోని అసమానతలపై గళం విప్పారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ జన సభలో దీర్ఘకాలం పని చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా ఆయన్ను హత్య చేయించిందని ఆరోపించారు. ప్రజల స్థితిగతులను చూడాల్సిన ప్రభుత్వాలు దాన్ని ఎప్పుడో విడిచి అదానీ, అంబానీ లాంటి వారికి రాయితీలు ఇస్తూ వారిని మరింత ధనవంతులుగా మారుస్తున్నాయని విమర్శించారు. ఖనిజ సంపదలను వెలికి తీయడానికి అడవులను నరకడం, ఆదివాసులను చంపడం వారి ప్రధాన లక్ష్యంగా మారిపోయిందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మనలాంటి మేధావులు ఐక్యంగా పోరాడి పేద ప్రజల వైపు నిలబడాలని సాటి మనిషిగా అది మన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో పాలమూర్ అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారీ, కేకే మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు వామన్‌కుమార్, నర్సయ్య, భీమయ్య పాల్గొన్నారు.
మన్యంకొండలో భక్తిశ్రద్ధలతో ‘పూర్ణాహుతి’
● ముగిసిన శ్రావణమాస విశేషోత్సవాలు
మహబూబ్‌నగర్ రూరల్: శ్రావణమాస విశేషోత్సవాల ముగింపును పురస్కరించుకొని మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం పూర్ణాహుతి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గత నెల 25న స్వామివారి విశేషోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెల రోజుల పాటు దేవస్థానంలో పలు పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక శాంతిహోమం జరిపిస్తారు. విశేషోత్సవాల సందర్భంగా స్వామివారిని బంగారు ఆభరణాలతో స్వర్ణాభరణ అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేయి తులసి దళాలతో తులసి నామార్చన చేశారు. ముగింపు వేడుకల సందర్భంగా హనుమద్దాసుల మండపంలో స్వామివారికి పలు పూజలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
పిల్లర్ గుంతలో పడి బాలుడి మృతి
మద్దూరు: భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని కేకే కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన భరత్‌కుమార్ (5) అదుపుతప్పి భవన నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడ్డాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ గుంతలో నీరు చేరడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. పనుల మీద బయటకు వెళ్లిన బాలుడి తండ్రి మొగులప్ప వచ్చి వెతుకుతున్న క్రమంలో పిల్లర్ గుంతలో మృతదేహం కనిపించింది. మొగులప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.

రాజ్యం మనిషి ప్రాణం కాపాడేదిగా ఉండాలి