
ప్రతి శుక్రవారం శుభ్రత పాటించాలి
● కలెక్టర్ విజయేందిర బోయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల్లో చెత్త, నీరు నిల్వ లేకుండా శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్‌తో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వ్యాధుల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. దోమల లార్వా వృద్ధి చెంది దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ, గ్రామాల్లోని అన్నివార్డుల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో డెంగీ కేసులు నమోదు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెంగీ కేసులు ప్రబలే హాట్‌స్పాట్‌లు గుర్తించి దోమల నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. ఓపెన్ ప్లాట్ యజమానులకు చెత్త తొలగించాలని, క్లీన్ చేయకుంటే నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని సూచించారు. పీహెచ్‌సీల వారీగా డెంగీ కేసుల నమోదుపై మెడికల్ ఆఫీసర్‌లతో సమీక్షించి కారణాలు తెలుసుకున్నారు. రెండు రోజులు జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లలో చెత్త, నీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆశవర్కర్‌లు ప్రతిరోజూ 50 ఇండ్లను సందర్శించాలని జ్వరాలు సర్వే, అంటీ లార్వా ఆపరేషన్ చర్యలపై అవగాహన కల్పించి పరిసరాలను క్లీన్ చేయాలన్నారు. సెప్టెంబర్ వరకు ప్రతి ఇంటిని 4సార్లు సందర్శించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎంహెచ్‌ఓ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులనుపెండింగ్‌లో పెట్టొద్దు
భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భాగంగా వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా సమీక్షించాలన్నారు. భూ భారతిలో సక్సెషన్, మ్యుటేషన్, డేటా సరిచేసే ప్రక్రియ తదితర వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.