
ఒకే కెమెరాలో 4సార్లు
● టీడీగుట్టపై మళ్లీ కనిపించిన చిరుత
● 15రోజులుగా ఆనవాళ్లు లేకనే సెర్చ్ బృందాల రద్దు
● ఎఫ్‌ఆర్‌ఓ నేతృత్వంలో రంగంలోకి..
● బెంబేలెత్తుతున్న స్థానిక ప్రజలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను చిరుత బెంబేలెత్తిస్తోంది. పదిహేను రోజులుగా ఎక్కడా కనిపించకపోవడంతో పోయివుంటదిలే అనుకున్న వెంటనే మెరుపులా ఎక్కడోచోట కనిపించి కలవరపెడుతోంది. రెండు నెలలుగా భయాందోళనకు గురిచేస్తున్న చిరుత తరచుగా గుట్టపై నుంచి డంపింగ్‌యార్డు వైపు వెళుతూ ఒకే కెమెరాలో 4 సార్లు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. అటువైపు వెళ్లిన చిరుత మళ్లీ అదేదారిలో రావడంలేదు. ఏ ఒక్క కెమెరాలోనూ కనిపించడంలేదు. కోయిలకొండ క్రాస్‌రోడ్డు సమీపంలో గుట్టపై పాత డంపింగ్‌యార్డు సమీపంలో అమర్చిన ఈ ట్రాప్ కెమెరాలోనే 4సార్లు కనిపించినా సమీపంలో ఉన్న బోనుకు మాత్రం చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది.
చిరుత డంపింగ్‌యార్డు వైపు వెళుతున్న క్రమంలో గతనెల 22న సాయంత్రం 6:50 గంటలకు, ఈ నెల 1న రాత్రి 8:48 గంటలకు, 10న తెల్లవారుజామున 3:49 గంటలకు, మళ్లీ ఈనెల 24న రాత్రి 11:05 గంటలకు కనిపించింది. అటువైపుగా వెళ్తున్న చిరుత మళ్లీ ఏ కెమెరాకు కంటపడకుండా వెనక్కి రావడం గమనార్హం. ఈనెల 10న ట్రాప్ కెమెరాలో కనిపించిన చిరుత మళ్లీ 15రోజుల వరకు ఏ కెమెరాలో కనిపించక పోవడంతో ఇటీవల సెర్చ్ బృందాలను రద్దు చేశారు. ఆ పరిధి బీట్ ఆఫీసర్‌తోపాటు సెక్షన్ ఆఫీసర్ ఇద్దరు మాత్రమే ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. తాజాగా గురువారం మధ్యాహ్నం టీడీగుట్ట మీద గుండుపై చిరుత కనిపించడం కలకలం రేపింది. గతంలోనూ లైవ్‌గా తరచుగా పలుమార్లు చిరుత కనిపించిన విషయం తెలిసిందే. వీరన్నపేట, టీడీగుట్ట, డంపింగ్ యార్డు ప్రాంతాల్లో మొత్తం 20 ట్రాప్ కెమెరాలు, 4 లైవ్ కెమెరాలు, 4బోన్‌లను ఏర్పాటు చేశారు.
చిరుత వీడియో వైరల్
ఎంత ప్రయత్నించినా బోనుకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న చిరుత తిర్మల్‌దేవునిగుట్ట మీద గుండుపై మళ్లీ కనిపించింది. గురువారం మధ్యాహ్నం టీడీగుట్ట హైస్కూల్ ఎదురుగా గుట్టపై ఉన్న గుండు మీద తిరుగుతూ కనిపించిన చిరుత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హాయ్ ఆధ్వర్యంలో చిరుత సంచరించిన ప్రాంతానికి వెళ్లిన ఫారెస్టు బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగించినా ఫలితం లేకపోయింది.
చిరుత సంచారంతో రెండు నెలలుగా టీడీగుట్ట, వీరన్నపేట, కోయిలకొండ క్రాస్‌రోడ్డు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఎక్కడ చిరుత దాడి చేస్తుందోననే భయాందోళనతో గడుపుతున్నారు. ఒకవైపు నాలుగు బోన్‌లు, 20 ట్రాప్ కెమెరాలు, 4 లైవ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ఆపరేషన్ కొనసాగించినా చిరుత మాత్రం తప్పించుకు తిరుగుతుంది. సెర్చ్ బృందాల కళ్లు గప్పి అప్పుడప్పుడు గుట్టపై ఉన్న గుండ్లపై తిరుగుతూ కనిపించడం కలకలం రేపుతోంది. ఒకసారి కనిపించిన చిరుత మళ్లీ వారానికో, పదిరోజులకో కనిపిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.