
బస్సును ఢీకొట్టిన లారీ: యువకుడు దుర్మరణం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన ధీరజ్ కుమార్ (26) ఓ కంపెనీలో సిటీ స్కానింగ్ మిషన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిత్తూరులోని కె.ఎల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో సిటీ స్కానింగ్ మిషన్ రిపేరు నిమిత్తం వారం రోజుల క్రితం వెళ్లాడు. పని ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన బస్సులో తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై మునుగాల శివారులోకి రాగానే గురువారం తెల్లవారుజామున బస్సులోని ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జనకు డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపాడు. అదే దారిలో వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సు రోడ్డు కిందకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక భాగం, లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, బస్సులో వెనక బెర్త్‌లో ఉన్న ధీరజ్ కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మిగితా ప్రయాణికులు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధీరాజ్ తండ్రి శ్రవణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అలుగులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: అలుగులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం చెరువు వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఓ మహిళ తన భర్తతో గొడవపడి క్షణికావేశంలో అలుగులోకి దూకింది. ఆమెను రక్షించేందుకు భర్త వెంటనే నీటి ప్రవాహంలో దూకగా స్థానికులు గుర్తించి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. ప్రవాహం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.