
నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకించాలి
కొల్లాపూర్: బీజేపీ ప్రభుత్వ విధానాలపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్దంగా పాలన సాగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కొల్లాపూర్‌లోని మినీ స్టేడియంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ విద్య కాషాయికరణ జరగకుండా అడ్డుకునేందుకు సెక్యులర్ వాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన నూతన విద్యావిధానం–2020ని తెలంగాణలో కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇంటర్ కళాశాలల ఎత్తివేత ఇందులో భాగమేనన్నారు. పరోక్షంగా కేంద్రం విధానాలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోందన్నారు. బీజేపీ విధానాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలు నిజమైతే వెంటనే నూతన విద్యావిధానాన్ని రద్దుచేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం శాసీ్త్రయ విద్యావిధానానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యూజీసీ గైడ్‌లైన్స్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. సెమినార్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, ఉపాధ్యక్షులు కిరణ్, శంకర్, గర్‌ల్స్ కన్వీనర్ ఎం.పూజ తోపాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసంగించారు.