
పచ్చదనం కనుమరుగు!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో వాల్టా చట్టానికి కొందరు వ్యక్తులు తూట్లు పెట్టారు. అధికారుల అనుమతి తీసుకోకుండా ఏకంగా సుమారు 50 చెట్లను నరికివేశారు. వాస్తవానికి 2021లో ‘హరితహారం’ కింద మున్సిపల్ అధికారులు స్థానిక పద్మావతికాలనీ కామాన్ నుంచి కృష్ణా టెంపుల్ వెళ్లే దారిలో డివైడర్‌పై కోనోకార్పస్ మొక్కలను విరివిగా నాటారు. అవి ఇప్పుడు కనీసం పది ఫీట్ల వరకు ఏపుగా పెరిగాయి. వాటి కొమ్మలను ప్రతి ఆరు నెలలకోసారి కటి ంగ్ చేస్తూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు వ్యక్తులు సుమారు 50 కోనోకార్పస్ చెట్లను ఆనవాళ్లు లేకుండా పూర్తిగా నరికేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి సూచన మేరకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. కొమ్మలతో పాటు పెద్ద పెద్ద మండలను మొత్తం అలాగే వదిలేశారు. ఇది గమనించిన మున్సిపల్ సిబ్బంది మంగళవారం ట్రాక్టర్ తో డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పచ్చదనం లేక బోసిపోయి కనిపిస్తోంది. ఈ విషయమై ఎంఈ యు.బస్వరాజ్‌ను వివరణ కోరగా అక్కడి చెట్లను నరికివేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. త్వరలోనే బాధ్యులను గుర్తించి అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
రైలు ఢీ.. రైతు మృతి
మహబూబ్‌నగర్ క్రైం: అర్ధరాత్రి పంట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని చౌదర్‌పల్లికి చెందిన లచ్చిగారి కాశీం (45) మంగళవారం తెల్లవారుజామున వరి పంటకు నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్తూ రైలు పట్టాలను దాటేయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.